మనం విస్మరిస్తున్న మనతరం వీరుడు కీర్తిచక్ర పందిళ్ళపల్లి శ్రీనివాస్ 57 జయంతి సందర్భంగా...

ఓ వీరుడా....
ఉక్కు నరాల్లోంచి ఫెళ్లుమన్న అగ్నిచ్ఛటవు నీవు...
చీకటి గర్భాన్ని చీల్చిన ధగద్ధగల కాంతి ప్రహారానివి నీవు...
మెదళ్ల నెగళ్లని రాజేస్తూ మా నరాల్లో రక్తం మరిగిస్తున్నది నీవు...
మెడపై గుచ్చుకున్న కత్తిని చిర్నవ్వుతో కరిగించే మర్మం చెబుతున్నది నీవు...
సైతాన్లు తొలుస్తున్న మనసుల్లోకి కరుణామృతాన్ని ఒంచిన గౌతముడా!
నీకెక్కడిదయ్యా మరణం...
మా తరానికి తరమే నిన్నుగుండెగుండెలో పదిలంగా పొదువుకుంటే...
మా ద్వేషపు ఇరుకు మనసు దారుల్లో
నువ్వు పెట్టిన చిన్నదీపం దోవచూపుతుంటే...
క్రౌర్యాన్ని జయించిన నీ చిర్నవ్వు వశీకరణమంత్రం అడవి అంతటా ఓంకారమవుతుంటే...
నీ కెక్కడిదయ్యా మరణం...
నీవు అమరుడివి... అమృతుడివి... అద్వితీయుడివి ... అనితర సాధ్యుడివి.
నిన్ను కని, మా తరానికి బంగారు కానుకగా ఇచ్చిన జయలక్ష్మి, అనంతరావులు ఎంత ధన్యులు!
ఎక్కడో రాజమండ్రిలో పుట్టి, గోపీనాధం అడవుల్లోకి వెళ్లి,
రక్తం రుచిమరిగిన తోడేళ్లకు, అడవినిమింగేస్తున్న వీరప్పన్‌లకు
బతుకు దిశని, బతుకులోని తీపిని, బతుకుని ఉద్దీప్తం చేసే మానవీయ అంశనీ బోధించావు...
కరకు మనసుల్ని కరుణతో కరిగించాలన్నావు...
అడవిలో వున్నావు... అన్నార్తులతో గడిపావు... పుట్టుకతో ఎవ్వరూ దుర్మార్గులుకారన్నావు. మనిషిని నేరస్థుణ్ణిచేసే కారణాల్ని వెతికావు... ఒంటరిగా, గాంధేయపథికుడిగా సాగిపోయావు.
అడవిదొంగ ఉరిమే తుపాకి ముందు అహింసని జపిస్తూ నిలబడ్డావు...
తోటివాళ్ల వెటకారాల్నీ, వేధింపుల్నీ, అవహేళనల్నీ నవ్వుతూ ధీశాలిగా తేలగొట్టావు...
మానవత్వం మూర్తిమంతం అయిన శ్రీనివాసా!
మనిషిమీద ఎంత గొప్ప నమ్మకం నీకు...
మనసుని ప్రేమతో గెలుచుకుంటానన్నావు...
కాని, క్రౌర్యానికి మనిషిరూపైన ఆ ఉన్మాది అడవిదొంగకి మనసొకటా?
నీ గుండెని తుపాకి గుళ్లతో ఛిద్రం చేసి, మనిషి మనిషికి మధ్య నమ్మకానికి నిలువుపాతరేసి, తన కాళ్లని తనే నరుక్కున్నాడు వాడు.
అయితేనేం... నీవు భౌతికంగా మా మధ్య లేకపోతేనేం...
అడవిలోని అణువణువులో నీ అడుగుజాడ వుంది...
అడవిలోని మనిషి మనిషి గుండెలో నీకొక గుడివుంది...
నీ ఆశయాల కాగడా నిత్యం వెలుగుతూనేవుంటుంది...
నీవు పరచిన సంస్కరణల బాట నిత్యం వసంతాన్ని చిగురిస్తూనేవుంటుంది.
అవి కరడుగట్టిన మనసుల్లో తప్పకుండా పూలు పూయిస్తాయి...
ఆ పువ్వుల నవ్వుల్లో నువ్వు దర్శనమిస్తావు... మా రాజులా...
అప్పుడు గోపీనాధం అడవంతా, అణువణువంతా నువ్వు పరిమళిస్తావు...
నీ జ్ఞాపకాల ఆసరాతో మా మధ్య వున్న నీ మాతాపితలకు
మా ఈ 'జై భారత్‌ - జనహర్ష మహాత్మాగాంధీ సామరస్య పురస్కారం'-
'sheshu 9866854585; seshudaroori@gmail.com.